క్రికెట్ నాగరికులకు ఒక చిన్న విజ్ఞప్తి

క్రికెట్ నాగరికులకు ఒక చిన్న విజ్ఞప్తి

Feb 20, 2021

"ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు"

[మా పోడ్కాస్ట్ ప్రేరణకు, మరియు కోట్లాది తెలుగు ప్రజల అభిమానంకు పాత్రులైన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మాటలు ముత్యాల కోటలు]

నమస్కారం అండీ (గమనిక: క్రింది మాటలలో గోదావరి యాస మీతో గుసగుసలాడచ్చు. కుదిరితే సర్దుకుపోండి, కొంచెం తీపి ఎక్కువైతే ఒక చిరు...ఉమ్.. ఆ... సిరి నవ్వు సమర్పించుకోండి)

గత సంవత్సరం ప్రపంచం మొత్తం లొక్డౌన్ చిక్కుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో, ఒక మిత్రుడితో సంభాషించిన ముచ్చట మమ్మల్ని ఈ మాటలను రాయిస్తున్నాయి

మన దేశంలో కొన్ని రంగాలకు ఇసుకేస్తే రాలనంత అభిమానం!! అందులోను క్రికెట్ అంటే ప్రత్యేకమైన ప్రీతి (అర్జున్ రెడ్డి లో హీరోయిన్ కాదులెండి). మన తెలుగు ప్రజలకు సినిమా మరియు క్రికెట్ కబుర్లు వినడం, చెప్పడం అంటే అబ్బో....ఆ భావనను అక్షరాలలో బంధిచడం కష్టం లెండి. ఇంతకీ విషయమేంటంటే, అదిగో... అలా కరోనా కరువు కాలం లో, అలాంటి ముచ్చట్లను ఒక స్నేహితుడితో సంభాషిస్తున్న సమయం లో పుట్టిన స్ఫూర్తికి ప్రతిబింబమే ఈ మా "క్రికెట్ నగరం పోడ్కాస్ట్"

ఎప్పటికప్పుడు మీ ఆశారుచులకు అనుగుణంగా మరియు ఒక సగటు అభిమాని అభిప్రాయానికి దగ్గరగా మనకిష్టమైన క్రీడా భాషలో క్రికెట్ ముచ్చట్లు చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. మీ అందరి ఆశీస్సులతో మొన్ననే 50 ఎపిసోడ్లు పూర్తి చేసాం లెండి. మా ఈ చిరు ప్రయాణంలో మీ ప్రోత్సాహమే మా ప్రధాన ఇంధన మూలం అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మీరు మా పైన పెట్టుకున్న నమ్మకానికి నిత్యం అంతఃకరణశుద్ధితో (సినిమా ప్రభావం మాములుగా ఉండదు మరి) పని చెయ్యడం కొంచెం సవాలు గానే అనిపించింది.

ఎక్కడో మారుమూల నరసాపురం దగ్గర నుండి న్యూ యార్క్ నగరం వరకు మీ ఆధారాభిమానాల రూపం లో మమ్మల్ని ఎప్పటికప్పుడు పలకరిస్తున్నందుకు నిత్యం మీ ప్రేమకు ఋణస్థులమే. మా పోడ్కాస్ట్ లో మిమ్మల్ని రెగ్యులర్ గా పలకరించే గొంతులు రెండే అయినా, మా కృషి వెనక మహర్షి సినిమాలో రిషి లాగ మరో ముగ్గురు సూపర్ స్టార్స్ వున్నారు. ఇక ముందు కూడా మన ఈ తెలుగు క్రికెట్ ప్లానెట్ అనే బొంగరం గిర్రుమని తిరగాలంటే దానికి మీ సహాయం కొద్దిగా అవసరమని మేము గ్రహించి చేసుకుంటున్న వినయపూర్వకమైన విన్నపం ఇది.

మా ఈ క్రీడా నావ ముందుకు వెళ్ళడానికి మీ వంతు సాయం అందించగలరని ఆశిస్తూ....క్రికెట్ నగరం కుటుంబం

¿Te gusta esta publicación?

Comprar cricketnagaram un café

Más de cricketnagaram